Reading Time: < 1 minute

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
14-03-2026

జిల్లాలో జరుగుతున్న పదవ తరగతి వార్షిక పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. శనివారం పాల్వంచ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు జిల్లా పరిషత్ ఉన్నత బాలికల అభ్యుదయ పాఠశాల పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పరీక్షలు సక్రమంగా నిర్వహించబడుతున్నాయా అనే అంశాలను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థులకు కల్పించిన సీసీ కెమెరాలు, తాగునీరు, ఫర్నిచర్ తదితర సౌకర్యాలను పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.

జిల్లా పరిషత్ ఉన్నత బాలికల అభ్యుదయ పాఠశాలలో మొత్తం 210 మంది విద్యార్థులకు గాను 209 మంది హాజరుకాగా ఒకరు గైహాజరయ్యారు. అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 135 మందిలో 131 మంది హాజరుకాగా నలుగురు గైహాజరయ్యారు.

జిల్లా వ్యాప్తంగా మొత్తం 12,740 మంది విద్యార్థులు నమోదు కాగా, 12,701 మంది పరీక్షలకు హాజరయ్యారు. 39 మంది గైహాజరయ్యారని అధికారులు తెలిపారు. మొత్తం హాజరు శాతం 99.74 శాతంగా నమోదైంది.

పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 (బి) అమల్లో ఉందని, అనుమతి లేని వ్యక్తులు పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు.

ఈ తనిఖీలలో కలెక్టర్ వెంట సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.