Reading Time: < 1 minute

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
14-03-2026

జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని, గ్యాస్ సరఫరా పూర్తిగా సాధారణంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. గ్యాస్ కొరత ఉందన్న వదంతులను ప్రజలు నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు.

శనివారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, అదనపు కలెక్టర్ వేణుగోపాల్తో కలిసి పౌరసరఫరాలు, రెవెన్యూ, వైద్య, విద్యా శాఖలు మరియు గ్యాస్ పంపిణీ కేంద్రాల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

జిల్లాలో ప్రస్తుతం 26 గ్యాస్ పంపిణీ కేంద్రాలు పనిచేస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. అందులో హెచ్‌పీసీఎల్ – 14, బీపీసీఎల్ – 5, ఐఓసీఎల్ – 7 కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 4,69,075 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ రీఫిల్ బుకింగ్‌కు 45 రోజుల వ్యవధి ఉండగా, పట్టణాల్లో 25 రోజుల తర్వాత మాత్రమే రీఫిల్ బుకింగ్ చేయవచ్చని తెలిపారు.

గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేయడం లేదా బ్లాక్ మార్కెట్‌కు తరలించడం వంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హోటళ్లు, కమర్షియల్ సంస్థలు గృహ వినియోగానికి కేటాయించిన సబ్సిడీ సిలిండర్లను ఉపయోగిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

జిల్లాలో గ్యాస్ సరఫరా పర్యవేక్షణ కోసం డిస్ట్రిక్ట్ లెవెల్ ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. అవసరమైతే ప్రతి గ్యాస్ ఏజెన్సీ వద్ద విఆర్‌ఓ, పోలీసు కానిస్టేబుల్‌ను నియమించి సరఫరా ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ గ్యాస్ సరఫరా ప్రక్రియలో ఎలాంటి అంతరాయం కలగకుండా పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందని తెలిపారు. గ్యాస్ గోదాముల వద్ద భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు.

సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్, సిపిఓ సంజీవరావు, బీసీ సంక్షేమ అధికారి విజయలక్ష్మి, ఎస్సీ సంక్షేమ అధికారి శ్రీలత, వ్యవసాయ అధికారి బాబురావు, మహిళా శిశు సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా, జిల్లా వైద్య అధికారి తుకారాం రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.