భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
06-03-2026:
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం అన్ని శాఖల జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమం అమలుపై సమీక్ష నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ, అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ భాగస్వాములు కావాలని తెలిపారు. ప్రతి శాఖకు కేటాయించిన పనులను సమగ్ర ప్రణాళికతో అమలు చేసి లక్ష్యాలను సాధించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్యక్రమాలు, పెండింగ్ ఫైళ్ల పరిష్కారం, వైద్య ఆరోగ్య సేవల విస్తరణ, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన, అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత కార్యక్రమం వంటి కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని ఆదేశించారు.
జిల్లాలో కోతులు మరియు వీధి కుక్కల సమస్యల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ను కలెక్టర్ ఆదేశించారు. అలాగే ఎల్ఆర్ఎస్ టాక్స్ వసూళ్లను 100 శాతం పూర్తి చేయాలని, రహదారుల భద్రతకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు.
పాఠశాలలు, వసతి గృహాల్లో పారిశుధ్య కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షించాలని, విద్యార్థులకు అందించే భోజన నాణ్యతపై అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని పేర్కొన్నారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై ప్రతిరోజూ నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.
వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు యూరియా ఎరువుల సమర్థ వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, బాల్య వివాహాలను నిరోధించేందుకు “బాల్య వివాహాలు – బ్రతుకు ఆగం” కార్యక్రమం కింద విస్తృత ప్రచారం చేపట్టాలని తెలిపారు.
మహిళా సాధికారత కోసం మహిళా శక్తి క్యాంటీన్లు, మొక్కలు నాటడం, స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజీ రుణాలు, ప్రతి మహిళను SHG సభ్యురాలిగా చేర్చడం వంటి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయాలని సూచించారు.
ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో 99 రోజుల ప్రత్యేక కార్యాచరణను విజయవంతం చేయాలని, కార్యక్రమాల అమలును జిల్లా స్థాయిలో స్వయంగా పర్యవేక్షిస్తామని జిల్లా కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు.
- పాల్వంచలో భక్తి వైభవంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం – పాల్గొన్న మంత్రులు పొంగులేటి, తుమ్మల
- పాల్వంచలో నవ మహిళా సాధికార కేంద్రంలో యోగ్యత పత్రాలు, చెక్కుల పంపిణీ
- శ్రీరామనవమి ఏర్పాట్లకు సి ఎస్ ఆర్ సంస్థల సహకారం అవసరం: కలెక్టర్ అంకిత్
- పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్
- జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు – వదంతులను నమ్మవద్దు: కలెక్టర్ అంకిత్





